జనగామలో భాజపా కార్యకర్తలపై దాడి చేసిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకపోతే తమ చర్య ఎలా ఉంటుందో తెరాస ప్రభుత్వం చూస్తుందని హెచ్చరించారు. లాఠీచార్జ్‌లో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించిన అనంతరం... ఆలేరులో పాత్రికేయులతో మాట్లాడారు.
రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని బండి సంజయ్ విమర్శించారు. జనగామలో భాజపా కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనే దీనికి నిలువెత్తు నిదర్శమని తెలిపారు. అభివృద్ధి పేరుతో యాదాద్రిలో జరుగుతన్న అవినీతిని త్వరలోనే బయటపెడతానన్నారు. గత సంవత్సర కాలంగా పండగల సమయంలో భాజపా కార్యకర్తలపై దాడుల పేరుతో... తెరాస ప్రభుత్వం గిప్టులు ఇస్తుందని తెలిపారు. ఇలాంటి దాడులకు భాజపా తప్పకుండా రిటర్న్ గిప్ట్ ఇస్తుందని హెచ్చరించారు.
భాజపా అధికారంలోకి వచ్చాక తెరాసకు, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులకు బంపర్ ఆఫర్ ఇస్తామన్నారు. పదోన్నతులు, సీఎం మెప్పు పొందడానికి కొంతమంది అధికారులు ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు భాజపా వ్యతిరేకం అనే సంకేతాలు సీఎం ఆఫీసు నుంచి వస్తున్నాయని... కానీ వారి సమస్యలపై తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చామంటున్న 3లక్షల ఉద్యోగాలను చూపిస్తే... తెరాస నేతలకు పల్లకి సేవా చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'రైల్వే ఆస్పత్రిలో వాక్సిన్ పంపిణీ చేయాలి'