Yadadri Temple Reopening : లక్ష్మీనారసింహులు నివసించే నవవైకుంఠం.. ఇకపై శోభాయమానంగా దర్శనీయనుంది. చారిత్రక ప్రాశస్త్యం... ఆధునిక సోయగం కలగలిసిన పవిత్ర భూమి... తరతరాలు నిలిచిపోనుంది. ఆలయ పునరుద్ధరణ కారణంగా... ఆరేళ్లుగా బాలాలయంలోనే కొలువై భక్తులకు దర్శనమిచ్చిన లక్షీనృసింహుడు... తిరిగి తన నివాసానికి చేరుకున్నారు. దేదీప్యమానంగా వెలిగి పోతున్న గర్భగుడి నుంచి భక్త జనసందోహానికి కాసేపట్లో అభయం ఇవ్వనున్నారు. వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా నిర్ణయించిన ముహూర్తం మేరకు... 7 రోజుల పాటు పంచకుండాత్మక మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని.. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించారు. మార్చి 21న ప్రారంభమైన ఈ సంప్రోక్షణలో వేద పారాయణాలు, మూల మంత్రాల జపం నిర్వహించారు. బాలాలయంతో పాటు ప్రధాన ఆలయంలోనూ ఇందుకు సంబంధించిన క్రతువు జరిపారు. స్వస్తి వాచనం, యజ్ఞ హవనములు, మూల మంత్ర హవనములు, సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం తదితర శాస్త్రోక్తక క్రతువులు జరిపారు.
యాదాద్రిలో కేసీఆర్..: ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. యాదాద్రి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా ఆలయం వద్దకు చేరుకున్నారు. హెలికాఫ్టర్‌లో నేరుగా యాదాద్రి చేరుకున్న ఆయన.. ఆలయంపై విహంగ వీక్షణం చేశారు. బాలాలయంలోని బంగారు కవచ మూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లతో.. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, కళాప్రదర్శనల మధ్య శోభాయాత్ర వైభవంగా జరిగింది.
వైభవంగా శోభాయాత్ర..: సీఎం కేసీఆర్ మడి వస్త్రాలు ధరించి.. నేరుగా వచ్చి సతీసమేతంగా శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో సీఎం కుటుంబసభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు. పంచకుండాత్మక యాగం పూర్ణాహుతి అనంతరం.. బాలాలయం నుంచి వేదమంత్రోశ్చరణల నడుమ స్వామివారి సువర్ణమూర్తుల శోభాయాత్ర వైభవంగా సాగింది. ఆరేళ్ల తర్వాత స్వామివారు బాలాలయం నుంచి తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి ప్రవేశించారు. శోభాయాత్రలో భాగంగా పునర్‌నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ప్రదక్షిణలు నిర్వహించారు.
ఏకకాలంలో ఏడు గోపురాలపై..: వారం రోజుల పాటు పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు నిర్వహించిన మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా సాగింది. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ జరిపారు. రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి సమక్షంలో మహాసంప్రోక్షణ నిర్వహించారు. అదే సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన గోపురాలు, ప్రాకార మండపాలకు సంప్రోక్షణ నిర్వహించారు. ఆంజనేయస్వామి సన్నిధిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, గరుడ ఆళ్వార్ సన్నిధిలో సభాపతి పోచారం, తూర్పు రాజగోపురం వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంప్రోణక్షలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రాకార మండపం-22కు మంత్రి తలసాని, 24వ మండపం వద్ద హరీశ్‌రావు, పశ్చిమ రాజగోపురానికి జగదీశ్‌రెడ్డి, దక్షిణ రాజగోపురానికి నిరంజన్‌రెడ్డితో పాటు... మిగతా మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన చోట సంప్రోక్షణ, అభిషేకాల్లో పాల్గొన్నారు.
సీఎం ప్రథమారాధన..: మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధానాలయంలోకి అందరూ.. ప్రదక్షిణగా వెళ్లారు. సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారికి ప్రథమారాధన చేశారు. ఉపాలయాల్లో ప్రతిష్ఠా మూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆరగింపు సేవ చేశారు. తర్వాత తీర్థ, ప్రసాద గోష్టి జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ మహాపర్వంలో పాల్గొని స్వామివారిని సేవించుకుని తరించారు.
భాగస్వాములకు సన్మానం..: ఒకనాటిగుహాలయం నేడు ఆధ్యాత్మికకళాకాంతులతో అద్భుత దివ్యక్షేత్రంగారూపుదిద్దుకోవటంలో భాగస్వాములైనవారందరినీ ప్రభుత్వం ఘనంగాసన్మానించింది. వాస్తుశిల్పులు,స్థపతులుసహా ఎంతో మంది ఆలయ పునర్నిర్మాణంకోసం నిరంతరం శ్రమించి....ప్రపంచస్థాయిక్షేత్రన్ని రూపుదిద్దారు. ఇందులోప్రధాన భూమిక పోషించిన ఆలయఈవో గీత,యాడాఉపాధ్యక్షుడు కిషన్‌రావు,ఆర్కిటెక్ట్‌ఆనందసాయి,స్థపతిసుందర రాజన్ సహా ఆలయ నిర్మాణభాగస్వాములైన వారందరి(ఆయా శాఖల అధికారులు, శిల్పులు, స్వర్ణ, వడ్రంగి కళాకారులు)ని ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రులు శాలువాలతో సన్మానించి,అభినందనలుతెలిపారు. వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సన్మానించారు. మహోజ్వలఘట్టానికి కారకుడైన సీఎం కేసీఆర్‌ను దేవస్థానం తరఫున యాడా అధికారులు, మంత్రులు ఆత్మీయంగా సత్కరించారు.
అనతరం "యాదాద్రి- ది సేక్రెడ్ ఎబోడ్".. కాఫీ టేబుల్ బుక్‌ను సీఎం ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌తో ప్రజాప్రతినిధులంతా ఫొటోలు తీసుకున్న తర్వాత.. యాగశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న బోజనాన్ని స్వీకరించారు. సాయంత్రం ఏడున్నర నుంచి.. శాంతి కళ్యాణం, ఆచార్య, రుత్విక్ సన్మానం, మహదాశీర్వాదం, పరిసమాప్తి ఉంటుంది.
ఇదీ చూడండి: