యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. హాజీపూర్ శివారులోని పాడుబడ్డ బావి నుంచి శ్రావణి మృతదేహం వెలికితీసిన మూడు రోజులకు... మరో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. నెల క్రితం తప్పిపోయిన డిగ్రీ యువతి మృతదేహంగా పోలీసులు నిర్ధరించారు. అమ్మాయిలను హత్య చేసి, ఒకేచోట పూడ్చిపెట్టడం సంచలనంగా మారింది.
పటిష్ఠ బందోబస్తు మధ్య వెలికితీత
ఆ బావిలో అస్థికలు మాత్రమే బయటపడగా పోలీసులు వాటిని ప్రత్యేక భద్రత నడుమ తరలించారు. ఇద్దరు అమ్మాయిలు మృత్యువాత పడిన ఘటనపై... హాజీపూర్తోపాటు పరిసర గ్రామాల్లో విషాదం అలుముకుంది. జరిగిన ఘటనల్ని తలచుకుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డి
శ్రావణి హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డితోపాటు మొత్తం 15 మందిని విచారించారు. వారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు బావిలో మరో మృతదేహం ఉందని నిర్ధరించారు. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక బృందాలు పటిష్ఠ బందోబస్తు నడుమ తవ్వకాలు చేపట్టాయి. మనీషా మృతదేహం చూసి ఆమె తండ్రి గుండెలవిసేలా రోదించారు.
నెల క్రితమే మనీషా హత్య...
కీసరలోని ప్రైవేటు కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న మనీషా.. గత నెల 15న కళాశాలకు వెళ్లింది. అక్కడ తరగతులకు హాజరైనా.. తిరిగి స్వగ్రామానికి చేరుకోలేదు. కూతురు బయటకు వెళ్లిపోయిందేమనన్న భావనతో మనీషా తండ్రి తిప్పరబోయిన మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మల్లేశంకు నలుగురు కూతుళ్లు కాగా మనీషా నాలుగో సంతానం. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా... తల్లి లేకపోవడం వల్ల యువతి ఆలనాపాలనా తండ్రే చూసుకుంటున్నాడు. కూతురు కనిపించకుండా పోయినప్పటి నుంచి... మల్లేశం తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
శ్రావణి, మనీషాలే కాదు.. మరో అమ్మాయి అదృశ్యం..
శ్రావణి, మనీషాలే కాకుండా... మొత్తం ముగ్గురు విద్యార్థినులు అదే ప్రాంతంలో అదృశ్యమయ్యారు. ఇందులో బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన నందం అనే వ్యక్తి కూతురు కల్పన కూడా ఉన్నారు. తన కుమార్తె కనపడటం లేదంటూ... గతంలోనే పోలీసులను ఆశ్రయించాడు. అయినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడు శ్రావణి, మనీషా హత్యలతో కల్పన విషయంలో ఆమె తండ్రిలో గుబులు కనిపిస్తోంది.
72 గంటల్లో కేసుని చేధించిన పోలీసులు...
మరోవైపు శ్రావణి అదృశ్యమైనప్పటినుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రామస్థులే మృతదేహం ఆనవాళ్లు గుర్తించడం... ఖాకీల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటూ అక్కడి వాసులంతా ఆందోళనలు చేపట్టారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ స్వయంగా రంగప్రవేశం చేసి 24 గంటల్లో నిందితుల్ని పట్టుకుంటామని చెప్పగా.. కేసులో ఆధారాలు కీలకమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో దర్యాప్తును ప్రతిష్ఠాత్మకంగా భావించిన పోలీసులు మరో 72 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ హత్యలు ఎందుకు చేశారన్నది తేలాల్సి ఉంది.
ఇవీ చూడండి: భువనగిరి బావి మిస్టరీ... తాజాగా మరో మృతదేహం