యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలోని ప్రశాంత్నగకు చెందిన ఈ అవ్వ పేరు జీడిమట్ల సావిత్రమ్మ (80). ఆమె భర్త, పెద్ద కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోయారు. చిన్న కుమారుడు రవీందర్ రెడ్డి అయిదేళ్ల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. కోడళ్లు, వారి పిల్లలు.. ఆ ఇంటికి దూరంగా మరోచోట ఉంటున్నారు. దీంతో.. పండు వయసులో దిక్కులేని ఆ కొడుకుకి ఆ ముసలి తల్లే అన్నీ తానై చంటిబిడ్డలా చూసుకుంటూ సేవలు చేస్తోంది.
కదిలిస్తే వ్యధ..
అవ్వకు వచ్చే పెన్షన్ డబ్బే ఆ ఇంటికి ఆధారమైంది. వాటినే.. మందులు, మిగతా ఖర్చులకు వాడుతూ కాలం వెళ్లదీస్తోంది. రేషన్ కార్డు కూడా లేని వీరిని పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. కరోనా లాంటి సంక్షోభంలో.. తనకేదైనా అయితే తన కొడుకు పరిస్థితి ఏమవుతుందో అంటూ అవ్వ.. 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముందు కన్నీటి పర్యంతమైంది. తన కుమారుడికి పెన్షన్, రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్నివేడుకుంటోంది. దాతలెవరైనా ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్న తల్లీకొడుకులకు సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: వెల్లువలా నకిలీ శానిటైజర్లు.. ఆల్కహాల్‌కు బదులు రసాయనాలు