వర్షాకాలంలో రామన్నపేట రైల్వే అండర్‌పాస్ వంతెన కింద నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా ఫిట్ ఇండియా ఉపాధ్యక్షుడు తలారి గణేశ్ తెలిపారు. మండల కేంద్రానికి వెళ్లాలంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు.
మండలంలోని వెల్లంకి, సిరిపురం, సర్నేని గూడెం, సుంకెనపల్లి గ్రామాల ప్రజలకు పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోల ద్వారా ప్రయాణించే సామాన్యులకు నరకప్రాయంగా మారిందన్నారు. ఈ విషయంపై జిల్లా పాలనాధికారి సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. రైల్వే అధికారులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్లు తలారి గణేశ్ పేర్కొన్నారు.