యాదాద్రి భువనగిరి జిల్లా శ్రావణి హత్యకేసు కీలక మలుపు తిరిగింది. శ్రావణి మృతదేహం లభ్యమైన బావిలోనే మరో మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ బావిలో పుస్తకాల సంచి బయటకు కనపడుతుండగా... శ్రావణి హత్య కేసు నిందితుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఇంకో మృతదేహం ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. భారీ బందోబస్తు మధ్య యువతి మృతదేహాన్ని వెలికితీశారు. హాజీపూర్ గ్రామానికి అర కిలోమీటరు దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఈ దుర్ఘటనలు జరిగాయి.
మృతురాలు నెల క్రితం తప్పిపోయిన డిగ్రీ యువతి మనీషాగా గుర్తించారు. శ్రావణి హత్యకేసులో ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గత గురువారం శ్రావణి అదృశ్యమవగా అదే రోజు రాత్రి కేసు నమోదైంది. బావిలో మృతదేహం ఉందని శుక్రవారం రాత్రి గుర్తించగా... అర్ధరాత్రి వెలికితీశారు. శనివారం ఉదయం హాజీపూర్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగా... అదే రోజు రాత్రి మరో వ్యక్తిని పట్టుకున్నారు. ఆదివారం ఉదయం ఇంకో 13 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా మృతదేహం ఉన్నట్లు వెల్లడైంది. నాలుగేళ్ల క్రితం కల్పన అనే అమ్మాయి కూడా తప్పిపోయిందని... ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదని గ్రామస్థులు వాపోతున్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.