Minister Indrakaran at Yadadri: యాదాద్రి ప్రధానాలయం అభివృద్ధి పనులు పరిశీలించి కొండ కింద పనుల పరిశీలనకు వెళ్తున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కొండపైన దుకాణదారులు అడ్డుకున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కొండపైన దుకాణాలు కోల్పోయిన దుకాణదారులు.. మళ్లీ అక్కడే కేటాయించాలని కోరుతూ మంత్రి ఇంద్రకరణ్ కాన్వాయ్‌ను ఆపి నిరసన తెలిపారు. దీంతో వాహనం నుంచి కిందకు దిగిన మంత్రి.. దుకాణదారుల వినతిపత్రం స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హామీ ఇవ్వడంతో దుకాణదారులు నిరసన విరమించారు. అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం కొండపైన హరిత కాటేజీలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
అంతకు ముందు ప్రధానాలయ అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. మహాకుంభ సంప్రోక్షణకు గడువు సమీపిస్తుండగా.. ఆయన యాదాద్రిలో పర్యటించారు. కొండపైన కలియదిరిగిన ఇంద్రకరణ్‌రెడ్డికి యాడా ఉపాధ్యక్షుడు కిషన్‌రావు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ఈవో గీతారెడ్డి పనులకు సంబంధించిన వివరాలు తెలిపారు. క్యూలైన్లు, ప్రసాదాల తయారీ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. అంతకుముందు లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ఇంద్రకరణ్‌రెడ్డికి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌తో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మంత్రి పర్యటనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'అత్యవసరమైతేనే పోలీస్‌స్టేషన్‌కు రండి.. ప్రజలకు యాదాద్రి పోలీసుల సూచన'