నేడు నారసింహుని జన్మ నక్షత్రం... స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు. ఉదయం బాలాలయంలో సుప్రభాతం చేపట్టిన పూజారులు వైష్ణవ ఆచారంగా పంచ నారసింహులను మేల్కొల్పి హారతి నివేదన, తులసీ పత్రాలతో అర్చన జరిపారు. ఇవాళ స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు.
నారసింహుని జన్మనక్షత్రం సందర్భంగా శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శత కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు,పెరుగుతో వేదమంత్రాలు, మంగళ వాద్యాల నడుమ నారసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో ఆలయాధికారులు భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు. సహస్రనామాలతో అష్టోత్తరం, భక్తులకు దర్శనమిచ్చే కవచ మూర్తులకు స్వర్ణపుష్పార్చన జరిపారు. కరోనా మహమ్మారి నుంచి సకల జనులకు విముక్తి కలిగించాలంటూ పూజలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.