యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఓవైపు పునర్నిర్మాణ పనులు... మరోవైపు మరమ్మతులు వేగంగా సాగుతున్నాయి. వర్షం తగ్గడం వల్ల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. వర్షాలకు కలిగిన నష్టాలను ఆరా తీసిన యాడ అధికారులు... సరిదిద్దే పనులను ముమ్మరం చేశారు. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో కొండకు దక్షిణ దిశలో జారిన ఎర్ర మట్టి కుప్పలు తొలగించి పచ్చదనం కోసం పెంచుతున్న మొక్కలను సరి దిద్దుతున్నారు.
కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భక్తులకు తలనీలాలు తీసే చోట వర్షపు నీరు వచ్చి చేరింది. భక్తులకు ఇక్కట్లు కలగకుండా నీటిని తొలగించారు. ఉత్తరదిశలో రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. ఈ గోడ నిర్మాణం పూర్తయితే చదును పనులు నిర్వహించవచ్చని ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. కొండ కింద తులసి తోట ప్రాంగణంలో పై వంతెన కోసం తీసిన గుంతల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించే పనిలో పడ్డారు. ప్రధాన ఆలయంలో దుమ్మును మిషన్ల ద్వారా తొలగిస్తున్నారు. శిల్పాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.