యాదాద్రి భువనగిరి జిల్లా నారసింహుని సన్నిధిలో పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన కట్టడాల నిర్మాణాలు దాదాపు పూర్తికావడం వల్ల మిగిలిన పనులను ముమ్మరం చేశారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో ఫ్లోరింగ్, రథశాల, ఎస్కలేటర్ పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్, డ్రైనేజీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్యూ లైన్ల కోసం స్టీల్ గ్రిల్స్ అమరుస్తున్నారు. పుష్కరిణి పునరుద్ధరణ, మెట్లదారుల నిర్మాణం పనులనూ వేగవంతం చేశారు.
ఆలయ ప్రాంగణంలోపలి, వెలుపలి.. సాలహారాలలో భగవంతుని విగ్రహ రూపాలకు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అష్టభుజ మండప ప్రాకారాలపై సాలహారాలు వైష్ణవత్వం ఉట్టిపడేలా దశావతారాలు, నారసింహ రూపాలతో తీర్చిదిద్దే పనులు మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి.