తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. భక్తులకు సదుపాయాలు కల్పించే దిశగా యాడా అడుగులు వేస్తోంది. క్యూలైన్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్టీల్ గ్రిల్స్‌తో సముదాయాల్లో దర్శన వరుసల పనులు జోరందుకున్నాయి.
పుష్కరిణి వద్ద బండలు తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొండ దిగువన పనులు సైతం వేగవంతం అయ్యాయి. వలయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంది. పోలీస్ బందోబస్తు నడుమ ఇళ్ల కూల్చివేత చేపట్టారు. రోడ్డు విస్తరణలో దుకాణాలు, ఇల్లు కోల్పోతున్న బాధితులు ఆందోళనకు దిగితే.. అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో కూల్చివేతలు పూర్తి కావాలని ఇటీవల పర్యటనకు వచ్చిన సీఎంఓ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వచ్చేలోపు పనులు పూర్తి కావాలని అధికారులు భావిస్తున్నారు. అటు యాదాద్రి అద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. స్తంభోధ్బవుడి సన్నిధిని ఏకజాతికి చెందిన కృష్ణ శిలతో రూపొందించిన అష్టభుజ మండప ప్రాకారాలు అబ్బురపరుస్తున్నాయి. ఆలయానికి నలుదిక్కుల్లోని స్తూపాలపై కళాకృతులు కొలువుదీరాయి.