యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో జరుగతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. పనితీరు సరిగాలేని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి నాలుగు గంటల పాటు కొండకింద జరుగుతున్న కల్యాణ కట్ట, పుష్కరిణి, అన్నదాన సత్రం, ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం, దీక్షాపరుల మండపం పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పునర్మిస్తున్న ప్రధానాలయ పనులను పరిశీలించారు. కొండ కింద నిర్మాణ పనులు 60 శాతం, ప్రధానాలయంలో 95 శాతం పనులు పూర్తయినట్లు వెల్లడించారు. ఆలయ పునఃప్రారంభ తేదీని చినజీయర్ స్వామితో చర్చించాక సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
అలెన్మెంట్ మార్చండి : బాధితులు
అనంతరం కొంతమంది రోడ్డు బాధితులు రోడ్డు అలైన్మెంట్ మార్చాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. అలైన్మెంట్ మార్చడం వీలుకాదని, పరిహారం పెంపుపై సీఎంతో చర్చిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, సీఎంఓ భూపాల్ రెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, వైటీడీఏ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 43 శాతం ఫిట్‌మెంట్ కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు