Malkapur Park: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పార్కు నిర్మాణం ప్రారంభమైంది. తొలుత 687 ఎకరాలు భూ సేకరణ అవసరమని అధికారులు అంచనా వేయగా.. ప్రస్తుతం రెండువేలకు చేరుకుంది. పూర్తి కాలుష్య రహితంగా ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. అక్కడ తయారై ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నవి ఎలక్ట్రిక్ వాహనాలే కావడం విశేషం. 'జీరో 21' రెన్యూవెబుల్ ఎనర్జీ సొల్యూషన్ పేరుతో నాలుగు నెలలుగా రాణి శ్రీనివాస్ ఎలక్ట్రిక్ ఆటోలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం రవాణా, ప్రయాణీకుల ఆటోలతో పాటు డీజిల్, పెట్రోల్ వెర్షన్లో ఉన్న ఆటోలనూ ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుతున్నారు. ఏపీ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు వాహనాలను ఎగమతి చేశారు.
250 మందికి పైగా ఉపాధి..
మసాలాల తయారీ కంపెనీతో పాటు ప్లాస్టిక్ ఉత్పత్తులు, ప్యాకేజీ, బిల్డింగ్ మెటీరియల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ ఆటో యూనిట్, బ్రిక్స్ తయారీ లాంటి 15 పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమై ఇతర ప్రాంతాలకు ఎగుమతులు మొదలయ్యాయి. వివిధ పరిశ్రమల్లో 250 మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పక్కనే నిర్మించిన ఆ పార్కులో వసతుల కల్పన తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే పార్కు మొత్తం నాలుగు, రెండు వరుస రహదారులను నిర్మించగా, భూగర్భ మురుగు కాల్వలు, విద్యుత్ ఉప కేంద్రం పనులు పూర్తయ్యాయి.
రూ.40 కోట్లతో నివాస సముదాయాలు..
కార్మికుల కోసం రూ.40 కోట్లతో నివాస సముదాయాలు, పార్కు అవసరాలు, వివిధ సమావేశాల కోసం నిర్మిస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ భవన నిర్మాణం తుదిదశకు చేరుకుంది. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలతో పాటు సూపర్ మార్కెట్, రెస్టారెంట్లు, విడిభాగాల విక్రయ కేంద్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చే ఇంజినీర్లు, నిపుణులకు వసతి కల్పించనున్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణనిచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పార్కులో ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Pratidwani: పిల్లలకు విధిగా హెల్మెట్.. నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్షలేంటి ?