తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి (pochampally) అరుదైన గౌరవం లభించింది. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లిని ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక చేసింది (bhoodan pochampally recognised as world tourist spot). డిసెంబరు 2న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. భూదాన ఉద్యమంతో ఈ గ్రామం భూదాన్ పోచంపల్లిగా ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.
ఉత్తమ పర్యాటక గ్రామం కేటగిరి కింద భారత్ నుంచి మూడు గ్రామాలు ఎంపికయ్యాయి. తెలంగాణలోని పోచంపల్లితోపాటు మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్, మేఘాలయాలోని కోంగ్‌తాంగ్ గ్రామాలు నామినేట్ అయ్యాయి. వీటిని పరిశీలించిన ఐరాస పర్యాటక సంస్థ.. పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది.
ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా..
‘భూదాన్ పోచంపల్లి’కి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ ప్రపంచ పర్యాటక సంస్థ... భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అభినందనీయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా స్వయంపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా, తెలంగాణ చారిత్రక పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయని సీఎం తెలిపారు.
పోచంపల్లి నేత శైలి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది
ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి (bhoodan pochampally) ఎంపికైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (union minister kishan reddy) అన్నారు. ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ పోచంపల్లిని (pochampally) గుర్తించిందని పేర్కొన్నారు. పోచంపల్లి నేత శైలులు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని కిషన్‌రెడ్డి అన్నారు.
పోచంపల్లి ప్రజలకు అభినందనలు
భూదాన్ పోచంపల్లి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడంపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (minister ktr on bhoodan pochampally) హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడాన్ని తెలంగాణకు దక్కిన మరో అరుదైన గౌరవంగా మంత్రి అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు నేపథ్యంలో పోచంపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. అవార్డు కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇక్కడ చీరలకు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది..
తెలంగాణం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) నాయకత్వంలో తెరాస ప్రభుత్వం చేనేత రంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ చేనేత రంగాన్ని అనతికాలంలోనే అభివృద్ధి పథంలో నిలిపామని కేటీఆర్ అన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి నేతన్నలను ప్రోత్సహించే పలు కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. చేనేతకు పేరొందిన పోచంపల్లి గ్రామానికి అవార్డుతో అక్కడ నేసే ఇక్కడ చీరలకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయానికి ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు, ఇప్పుడు పోచంపల్లికి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడం తెలంగాణ పర్యాటక రంగానికి ఎంతగానో దోహదం చేస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ద్వారా ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపికైన తెలంగాణ పోచంపల్లి ప్రజలకు నా అభినందనలు. -కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి (ktr).
ఇదీ చూడండి: MLA quota MLC Election: ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు