మనం రాసే కవిత్వానికి చేసే ఆచరణకు సంబంధం ఉండాలని అప్పుడే ఆ కవిత్వం రాణిస్తుందని ప్రముఖ సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలం పాటిమట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులచే రూపొందించబడిన కవితా సంకలనం 'పాటిమట్ల పాలపిట్ట'కు బాలసాహిత్య ప్రతిభా పురస్కారాన్ని ఆయన అందజేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన "చింతోజు బ్రహ్మయ్య- బాలమణి చారిటబుల్ ట్రస్ట్" వారు ఎంపిక చేసే బాలసాహిత్య ప్రతిభా పురస్కారానికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు.
పాఠశాల స్థాయిలోనే కవిత్వ సృజన చేయడం అభినందించదగిన విషయం అని అందుకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులను కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అగ్గి రాములు, కవి, ఉపాధ్యాయుడు అరవింద రాయుడు, ప్రజా భారతి అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పలయ్య, మర్రి జయశ్రీ, కవి మోత్కూరు శ్రీనివాస్ ,సీనియర్ పాత్రికేయులు ఎస్ఎన్ చారి, యువ కవి బూరుగు గోపి కృష్ణ, గాదె వెంకటేశ్వర్లు, పసునూరి కృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎర్రబెల్లి ముత్తయ్య, ఆండ్ర నరసింహ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎందరికో ఆదర్శం ఈ మహిళ... చెత్త సేకరణే తనకు పండుగ!