Candidates observed polling stations: నెలరోజులకు పైగా అవిశ్రాంతంగా ఉపఎన్నిక ప్రచారంలో నిమగ్నమైన పార్టీల అభ్యర్థులు కీలక ఘట్టమైన పోలింగ్ రోజున మరింత హడావిడిగా గడిపారు. ఓ వైపు తమను గెలిపించాలని ప్రజలను కోరుతూనే.. పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ కనిపించారు. నెలరోజుల పాటు ఒక్కో గ్రామంలో పర్యటించిన అభ్యర్థులు.. ఈ ఒక్కరోజే నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేశారు.
అధికార తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ తన స్వగ్రామమైన సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తన ఓటు వేశారు. 173వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఆమె.. ప్రజలంతా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం చండూరు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు.
మునుగోడులో పోలింగ్ జరుగుతున్న తీరును భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మరో అభ్యర్థి కేఏ పాల్ ఉదయం నుంచి తీరిక లేకుండా గడిపారు. పోలింగ్ సమయంలో ఊర్లన్నీ చుట్టేసిన పాల్.. పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు తీస్తూ కనిపించారు. మునుగోడు ఉపఎన్నిక వేళ హోరెత్తిన ప్రచారాలు, మాటల మంటల మధ్య కేఏ పాల్ తనదైన శైలిలో చేపట్టిన కార్యక్రమాలు జనాలను ఎంతో నవ్వించాయి.
ఇవీ చదవండి: