కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం మండిపడ్డారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కరోనా సమయంలో పనులు లేక ఆర్థికంగా నష్టపోయిన కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ. 7500 అందించి అండగా నిలవాలని వెంకటేశం కోరారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆటో, భవన నిర్మాణ, హమాలీ కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే, ఎల్ఐసీ, డిఫెన్స్ తదితర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
సంఘటితంగా పోరాడాలి..
కార్మికులు సంఘటితంగా పోరాడి వారి హక్కులను సాధించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పేర్కొన్నారు. వారికి సీపీఐ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయీసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ఈఎస్ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్