యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల కరోనా అక్కడ అడుగుపెట్టలేకపోయింది. బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్లో ఉన్న 28 మందికి జరిపిన కొవిడ్-19 నిర్ధరణ పరీక్షల్లో 24 మందికి నెగిటివ్ అని తేలింది. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉదని జిల్లా వైద్యారోగ్య అధికారి సాంబశివరావు తెలిపారు.
ఆలేరు బస్టాండ్లో మతిస్థిమితం సరిగ్గాలేని ఓ తమిళ మహిళకు కరోనా సోకిందనే అనుమానంతో ఆమె శాంపిల్స్ సేకరించి హైదరాబాద్కు పంపించారు దాని ఫలితం నెగిటివ్గా వచ్చిందని సాంబశివరావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితమే వచ్చిందని చెప్పారు.
జిల్లాలో ప్రస్తుతం 391 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారని జిల్లా వైద్యారోగ్య అధికారి తెలిపారు. ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. ఉదయం వేళలో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ వాహనాలతో గల్లీల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.