Yadadri Moolamantra Yagam : యాదాద్రి క్షేత్రంలో స్వయంభువుల దర్శనాలకు ముందు జరపాల్సిన క్రతువులపై ఆలయ నిర్వాహకులు పునరాలోచనలో పడ్డారు. ఆలయ ఉద్ఘాటనకు ముందు చేయాలనుకున్న శ్రీ సుదర్శన మహాయాగం వాయిదా పడటంతో ప్రత్యామ్నాయంగా శాంతిపర్వాలను చేపట్టాలని తాజాగా యోచిస్తున్నారు. 1,008 కుండాలతో మహాయాగానికి బదులుగా 5 లేదా 9కుండాలతో ‘నారసింహ మూలమంత్ర యాగం’ చేసి ఆలయాన్ని పునఃప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అనుమతిస్తే ప్రత్యామ్నాయ పర్వాలతో మహాసంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయించారు.
ప్రథమ దర్శన భాగ్యం ఎవరికో..
ఈ విషయాన్ని అధికారులెవరూ స్పష్టం చేయడంలేదు. కొండపైన బాలాలయంలో లేదా ప్రధాన ఆలయ మాడ వీధిలో ఈ యాగం నిర్వహించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. అంటే వచ్చే నెల 21 నుంచి 27 వరకు యాగం, 28న సంప్రోక్షణ అనంతరం స్వామి నిజరూప దర్శనానికి భక్తులను ప్రధాన ఆలయంలోకి అనుమతించాలనేది ప్రస్తుత యోచన. ఈ మహాపర్వాల నిర్వహణను పర్యవేక్షించే ప్రముఖులు ఎవరు.. స్వయంభువుల దర్శనభాగ్యం దక్కించుకునే ప్రథమ భక్తులెవరో ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆలయఉద్ఘాటన పర్వంలో రాజగోపురాలు, దివ్య విమానంపై స్వర్ణ కలశాల ప్రతిష్ఠాపనోత్సవాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే ఆ పనులు మొదలయ్యాయి.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి దేవస్థానం సన్నద్ధమవుతోంది. మార్చి 4 పాల్గుణ శుద్ధ ద్వాదశి సోమవారం నుంచి 14 వరకు 11 రోజుల పాటు నిర్వహించేందుకు సంకల్పించింది. దీనిని ఈవో గీత ధ్రువీకరించారు. రెండు, మూడు రోజుల్లో అధికార ప్రకటన చేయనున్నట్లుగా పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలను ఆడంబరంగా కాకుండా ఆంతరంగికంగా బాలాలయంలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా నిబంధనలకు తోడు మార్చి 21 నుంచి 28 వరకు ప్రధానాలయంలో జరిగే మహా కుంభసంప్రోక్షణ ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం కొండ కింద నిర్వహించే స్వామి వారి వైభవోత్సవ కల్యాణం కూడా రద్దు చేస్తున్నట్లుగా సమాచారం.
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన శ్రీ స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం మార్చి 10న, తిరుకల్యాణోత్సవం11న, దివ్యవిమాన రథోత్సవం 12న చేపట్టనున్నట్లుగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్సవాల్లో పరిమితి మేర భక్తులకు అనుమతించనున్నారు. ఆ రోజుల్లో నిత్యకల్యాణాలు, మొక్కు పూజలు నిలిపివేయనున్నారు. ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లుగా ఈవో తెలిపారు.
ఇదీ చదవండి: యాదాద్రి శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం వాయిదా