యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా వద్ద ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నిరసనకు దిగారు. తాను ఎమ్మెల్సీనని చెప్పినా వినకుండా నర్సిరెడ్డి వాహనాన్ని టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. టోల్ఫీజ్ చెల్లించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్సీ ఐడి కార్డు చూపించినా అనుమతించకుండా... అత్యుత్సాహం చూపించారు. విసుగుచెందిన నర్సిరెడ్డి టోల్గేట్ వద్దే కారు వదిలేసి అక్కడే నిరసనకు దిగారు.
గన్మెన్ లేడని...
సమాచారం తెలిసి అనుమతించాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించగా... నర్సిరెడ్డిని వెళ్లిపోయేందుకు అనుమతించారు. చికాకు చెందిన నర్సిరెడ్డి అసలు ఏ ఎమ్మెల్సీని అపకుండా తననే ఎందుకు అడ్డుకున్నారో వివరణ ఇవ్వాలని బైఠాయించారు. గన్మెన్ లేకపోవడం వల్ల ఎమ్మెల్సీ అనుకోలేదని మొదట వివరించిన సిబ్బంది... టోల్ మినహాయింపు జాబితాలో ఎమ్మెల్సీ పేరు లేదంటూ మళ్లీ నచ్చజెప్పేప్రయత్నం చేశారు.
పునరావృతమైతే తీవ్ర స్పందన...
హైదరాబాద్ నుంచి నల్గొండకు ఎన్నోసార్లు పర్యటించే తనను గుర్తుపట్టకపోవటమేంటని నర్సిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే వ్యవహరిస్తే మందలించినట్లు గుర్తుచేశారు. ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా... తగు చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.