హరితహారం (haritha haram) కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి.. యాదాద్రి జిల్లా లోని పలు మండలాల్లో పర్యటించారు. భువనగిరి మండలం రాయిగిరి శివారులోని ఆంజనేయ అరణ్యాన్ని సందర్శించారు. అరణ్యంలో మొక్కలు నాటారు. అటవీ విస్తీర్ణానికి సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. యాదాద్రి ఆలయం ప్రారంభమైన తర్వాత ఈ క్షేత్రం పచ్చదనంలో శోభాయమానంగా ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. ఆంజనేయ అరణ్యంలో 30వేలకు పైగా మొక్కలు నాటామని మంత్రి తెలిపారు.
అనంతరం తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్, యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న మాలగుట్టపైన ఇరువురు మంత్రులు మొక్కలు నాటారు. అటవీ సంపదను పెంపొందించుకోవడం వల్ల ఎండవేడి అదుపులో ఉండి, వర్షాలు సకాలంలో కురుస్తాయన్నారు. చెట్లను పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడినవారమవుతామని మంత్రులు తెలిపారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని సూచించారు.
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంచాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్నాం. హరితహారంలో గతంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారాయి. రాయగిరి- 1లో గతంలో నాటిన 30 వేల మొక్కలు పెద్దవి అయ్యాయి. భువనగిరిలో ఫారెస్ట్ రేంజ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. ఇబ్రహీంపూర్లో అటవీక్షేత్రం ఏర్పాటు చేస్తాం. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులు 33 శాతానికి తేవాలన్నదే లక్ష్యం. దాని దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.- ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి.
ఇదీ చూడండి: GOVERNOR TAMILISAI: 'గిరిజనులతో కలిసి టీకా తీసుకోవడం సంతోషంగా ఉంది'