యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యాసంగి పంటకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 98వేల ఎకరాల్లో, లక్షా 8 వేల 895 మంది రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామన్నారు.
వాతావరణం అనుకూలించి దిగుబడి పెరిగిందని... ప్రస్తుతం 3 లక్షల 94 వేల 318 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. 96 ఐకేపీ కేంద్రాలు, 181 పీఏసీఎస్ సెంటర్లతో పాటు... జిల్లా వ్యాప్తంగా 277 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడ 25లక్షల 10 వేల గన్ని బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని... మిగితా 74 లక్షల 90 వేల గన్ని బ్యాగులు కొనుగోలు కేంద్రాలకు త్వరలోనే చేరుతాయన్నారు.
కరోనా ప్రభావం దృష్ట్యా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చే రైస్ మిల్ యాజమాన్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎలాంటి రెడ్ జోన్లు లేవు.. వదంతులు నమ్మొద్దు: ఈటల