Minister Indrakaran Yadadri Tour: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మార్చి 21 నుంచి 28 వరకు యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని పేర్కొన్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. అదే రోజు నుంచి యాదాద్రీశుడి స్వయంభు దర్శనాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. యాదాద్రీశుడి ప్రధానాలయం పనులను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్.. అనంతరం కొండపైన హరిత కాటేజీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మిగిలిన పనుల వివరాలు
ప్రధానాలయ పనులు 99 శాతం పూర్తయ్యాయని.. ధ్వజస్తంభం బంగారం తాపడం పనులు ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు. సప్త గోపురాలపై కలశాల బిగింపు పనులు ఫిబ్రవరి నెలాఖరు వరకు.. క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం పనులు ఈ నెలాఖరు వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రెసిడెన్షియల్ సూట్ పూర్తయిందని.. కొండపైన రూ.10 కోట్లతో బస్‌బే పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
లక్ష మందికి అన్న ప్రసాదం
మహా సుదర్శన యాగం జరిగే 8 రోజుల పాటు ప్రతి రోజూ లక్ష మంది భక్తులకు అన్న ప్రసాదం ఉంటుందని మంత్రి తెలిపారు. యాగానికి సంబంధించి ఇప్పటికే శ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ సూచనలు తీసుకున్నట్లు చెప్పారు. 75 ఎకరాల్లో 1008 హోమాది కుండాలతో, 6వేల మంది రుత్వికులతో పూజలు జరుగుతాయని వివరించారు.
"యాదాద్రిలో మార్చి 21 నుంచి 28 వరకు సుదర్శన మహాయాగం.. 28న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు నుంచే యాదాద్రీశుడి స్వయంభు దర్శనాలను.. భక్తులకు కల్పిస్తాం. మహా సుదర్శన యాగం జరిగే రోజుల్లో రోజూ లక్ష మందికి అన్న ప్రసాదం అందిస్తాం. 75 ఎకరాల్లో 6 వేల మంది రుత్వికులతో పూజలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. యాదాద్రీశుడి ప్రధానాలయ పనులు ఇప్పటివరకు 99 శాతం పూర్తయ్యాయి." --- ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి
స్వామి వారి దర్శనం
అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్.. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి.. లడ్డూ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ప్రధానాలయం అభివృద్ధి పనులు, ప్రసాద తయారీ, విక్రయ కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ప్రధానాలయం ప్రారంభం అనంతరం కూడా అభివృద్ధి పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.
దుకాణదారుల ఆందోళన
యాదాద్రి ప్రధానాలయం అభివృద్ధి పనులు పరిశీలించి కొండ కింద పనుల పరిశీలనకు వెళ్తున్న మంత్రిని కొండపైన దుకాణదారులు అడ్డుకున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కొండపైన షాపులు కోల్పోయిన దుకాణదారులు.. మళ్లీ అక్కడే కేటాయించాలని కోరుతూ మంత్రి ఇంద్రకరణ్ కాన్వాయ్‌ను ఆపి నిరసన తెలిపారు. దీంతో వాహనం నుంచి కిందికి దిగిన మంత్రి.. దుకాణదారుల వినతిపత్రం స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హామీ ఇవ్వడంతో దుకాణదారులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: KTR Comments: 'ఓపిక నశిస్తే కేంద్రంపై పోరాటానికి దిగాల్సి వస్తుంది..'