యాదాద్రి ఆలయం పునః ప్రారంభం (Yadadri Temple Reopening) ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ (Cm Kcr Yadadri Tour) మహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ (Mahakumbha Samprokshana) ఉటుందని సీఎం తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని సీఎం వివరించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం యాదాద్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సమైక్య పాలకుల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు.
‘‘సమైక్య పాలనలో ఆధ్యాత్మిక అంశంలో కూడా నిరాదరణ జరిగింది. గతంలో పుష్కరాలు కూడా తెలంగాణలో నిర్వహించలేదు. ఉద్యమ సమయంలో గోదావరి పుష్కర శోభ ప్రపంచానికి తెలియజేశాం. ఆధ్యాత్మిక సంపద ఉన్న ప్రాంతం తెలంగాణ. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి గతంలో ప్రాచుర్యం కల్పించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాచుర్యంలోకి తెచ్చాం. యాదాద్రి అభివృద్ధికి నాలుగైదేళ్ల క్రితం బీజం వేశాం. మహోత్కష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి. యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టాం. చినజీయర్ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు జరిగాయి. చినజీయర్‌స్వామి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆయన సూచనలతో సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చలు జరిపి పునర్నిర్మాణం చేశాం. అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటీ (Temple City) నిర్మాణం జరిగింది’’ అని సీఎం వివరించారు.
125 కిలోల బంగారంతో విమాన గోపురం..
యాదాద్రి ఆలయం విమాన గోపురానికి తిరుమల తరహాలో బంగారు తాపడం చేయించాలని నిర్ణయించాం. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరం. యాదాద్రికి తొలి విరాళంగా మా కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తాం. చాలా మంది దాతలు కిలో బంగారం చొప్పున కానుకగా ఇస్తామన్నారు. చినజీయర్‌స్వామి జీయర్‌పీఠం నుంచి కిలో బంగారం ఇస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి కిలో బంగారం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిలో బంగారం ఇస్తామన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి 2కిలోల బంగారం, కావేరీ సీడ్స్ తరఫున భాస్కర్‌రావు కిలో బంగారం ఇస్తామన్నారు. యావత్ ప్రజానీకంలో యాదాద్రి తమదనే భావన రావాలి.
-- సీఎం కేసీఆర్
యాదాద్రిలో రెండు రకాల డ్రైనేజీ వ్యవస్థ రావాలని సీఎం అన్నారు. వర్షా కాలంలో వరద నీరు వెళ్లేందుకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ ఉద్యోగులకు వీలైనంత త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. యాదాద్రి జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేసుకుందామని.. యాదాద్రి పుణ్యక్షేత్రంపై పరిశోధన వ్యాసాలు రావాలని సీఎం పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Kcr Yadadri Tour: యాదాద్రిలో 10 వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం: సీఎం