అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రెసిడెన్సీ పాఠశాలలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ పిల్లల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పిల్లల హక్కులు, వివిధ సమస్యల పట్ల ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మాక్ అసెంబ్లీ కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
పాఠశాల పిల్లలు, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు ఇలా వివిధ పాత్రలు పోషిస్తూ పాత్రలో లీనమై మాక్ అసెంబ్లీలో బాలల హక్కుల గురించి మాట్లాడారు. స్కూల్ పిల్లలు అందరూ ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : గాయత్రి పంప్‌హౌస్ నుంచి భారీగా జలాల ఎత్తిపోతలు