యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మించిన ప్రాకారాల పైనున్న సాలహారాల్లో శ్రీ కృష్ణ పరమాత్ముని అవతార ఘట్టాలు, నరసింహ స్వామి వివిధ ఆలయాల స్వరూపాలు తీర్చిదిద్దాలని చినజీయర్ స్వామి యాడా నిర్వాహకులకు సూచించినట్లు సమాచారం.
గతేడాది డిసెంబర్లో సీఎం కేసీఆర్ ఆలయ విస్తరణ పనులను సందర్శించినప్పుడు ఆలయ మండప ప్రాకారాల్లో రాతి గోడలు ఖాళీగా కనిపించకుండా ఆధ్యాత్మిక దృశ్యాలు రూపొందించాలని సూచించారు. ఈ మేరకు చినజీయర్ స్వామిని సంప్రదించి.. ఆయన సూచనలతో రెండో ప్రాకారంలో శ్రీకృష్ణ లీలలు తెలిపే విగ్రహాలను పింక్ గ్రానైట్‌తో తయారు చేయనున్నారు. యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా స్వామి రథశాల నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు యాడా అధికారులు వెల్లడించారు.