రాష్ట్రంలో మూడున్నర లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదని వామపక్షాల నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి ఆరోపించారు. తెరాస సర్కారు లక్షా 31 వేల ఉద్యోగాలిచ్చిందన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. చర్చకు పిలిస్తే జాడ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.
ఆరేళ్లు గడుస్తున్నా నిరుద్యోగుల్లో ఇంకా ఆందోళన, ఆవేదన కనిపిస్తోందన్నారు. ఖాళీలను ఇప్పటివరకు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఉన్నత పాఠశాల, జూనియర్, స్థానిక సాయిరాం డిగ్రీ కళాశాల్లో, అడ్డగుడూరు కేజీబీవీలో ప్రచారం నిర్వహించారు.
పోరాటం మరిచి..
రాష్ట్రం కోసం ఉద్యోగులు చేసిన పోరాటాన్ని మరిచి నేడు వారి భుజాలపైనే కేసీఆర్ స్వారీ చేస్తున్నారని విమర్శించారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని జయసారథి కోరారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, నాయకులు చేడ చంద్రయ్య, బోలగాని సత్యనారాయణ, మండల కార్యదర్శి ఏదునూరి, సీపీఎం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు వెంకటాచారి, కార్యదర్శి తొర్ర ఉప్పలయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెరాసకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి