PM Modi Nigeria Visit : నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం సహా పలు రంగాల్లో నైజీరియాతో సంబంధాలను పెంపొందించేందుకు భారత్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబుతో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'వాటి కోసం కలిసి పనిచేస్తాం'
"ఉగ్రవాదం, వేర్పాటువాదం, పైరసీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి భారత్, నైజీరియా కలిసి పనిచేస్తూనే ఉంటాయి. నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ చర్చల తర్వాత ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని విశ్వసిస్తున్నాను. దాదాపు 60,000 మంది ప్రవాస భారతీయులు భారత్-నైజీరియా సంబంధాలకు కీలక స్తంభంగా నిలుస్తున్నారు. వారి సంక్షేమానికి భరోసా ఇచ్చినందుకు టినుబుకు ధన్యవాదాలు. గత నెల(సెప్టెంబరు)లో బీభత్సం సృష్టించిన వరదల వల్ల నష్టపోయిన నైజీరియా ప్రజల కోసం భారత్ 20 టన్నుల సహాయ సామగ్రిని పంపుతుంది. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందడం ఒక కీలక పరిణామం" అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Had a very productive discussion with President Tinubu. We talked about adding momentum to our strategic partnership. There is immense scope for ties to flourish even further in sectors like defence, energy, technology, trade, health, education and more. @officialABAT pic.twitter.com/2i4JuF9CkX
— Narendra Modi (@narendramodi) November 17, 2024
ఒప్పందాలు కుదిరే అవకాశం
కాగా, ప్రతినిధి స్థాయి చర్చలకు ముందు భారత ప్రధాని మోదీ, నైజీరియా అధ్యక్షుడు టినుబు ప్రెసిడెన్షియల్ పరస్పరం సమావేశమయ్యారు. ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
PM Modi Nigeria Honour Award : ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం 'ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' ప్రకటించింది. ఈ అవార్డును అందుకున్న విదేశీయుల్లో మోదీ కంటే ముందు క్వీన్ ఎలిజబెత్ మాత్రమే ఉండటం విశేషం. దీంతో భారత ప్రధానికి విదేశాల నుంచి వచ్చిన పురస్కారాల సంఖ్య 17కు చేరింది.
#WATCH | Nigerian President Bola Ahmed Tinubu confers the Grand Commander of The Order of the Niger (GCON) on Prime Minister Narendra Modi, in Abuja.
— ANI (@ANI) November 17, 2024
Queen Elizabeth is the only foreign dignitary who has been awarded GCON in 1969. This will be the 17th such international award… pic.twitter.com/4YlzF3zqMe
భారత్కు మిత్రదేశం
2007 అక్టోబర్లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నైజీరియాలో పర్యటించారు. అప్పుడు ఆఫ్రికన్ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే నైజీరియా ఆరు దశాబ్దాల క్రితం నుంచి భారత్కు మిత్ర దేశంగా ఉంది. దాదాపు 60,000 మంది ప్రవాస భారతీయులు నైజీరియాలో ఉన్నారు. అలాగే 200కు పైగా భారతీయ కంపెనీలు నైజీరియాలో పెట్టుబడులు పెట్టాయి.
ప్రధాని మోదీ షెడ్యూల్
నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ఆదివారం నైజీరియాకు వెళ్లారు. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. తర్వాత జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లనున్నారు. అక్కడ వివిధ సభ్య దేశాధినేతలతో భేటీ కానున్నారు. 18, 19 తేదీల్లో రియో డీ జనీరోలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.