Lt. Col.Vinaybhanu Reddy's last rites ended: కల్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి మృతదేహం ఈరోజు ఆయన స్వగృహానికి చేరుకుంది. అంతిమ యాత్రలో ప్రజలు, విద్యార్థులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. వివిబి రెడ్డి అమర్ రహే, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. మద్రాస్ రెజిమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అమిత్‌షా ఆధ్వర్యంలో మిలటరీ సిబ్బంది అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు.
బొమ్మల రామారంలోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గ్రామంలోని వీధుల గుండా ఆయన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. అంతియాత్ర వెంట భారీగా ప్రజలు వెంట నడిచారు. ఆర్మీ అధికారులు జాతీయ పతాకాన్ని, ఆర్మీ యూనిఫాంను ఆయన భార్య మేజర్ స్పందనారెడ్డికి అందించారు. ఆర్మీ అధికారులు వినయ్‌భాను మృతదేహం వద్ద గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపారు. వినయ్‌భాను తండ్రి నరసింహారెడ్డి ముందు నడిచారు. కుమారుని చితికి నిప్పు అంటించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన ఉప్పల విజయలక్ష్మి, నరసింహారెడ్డి దంపతుల చిన్న కుమారుడు లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్‌భానురెడ్డి. తండ్రి నరసింహారెడ్డి ఆర్ఫీఎఫ్లో ఉద్యోగి కావడంతో 40 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ మల్కాజిగిరిలో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు ఉదయ్ భానురెడ్డి సాప్ట్వేర్ రంగంలో అమెరికాలో స్థిరపడగా, రెండో కుమారుడు వినయ్‌భానురెడ్డికి దేశభక్తి ఎక్కువ. దీంతో మద్రాస్ ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ సాధించినా, దాన్ని వదులుకొని దేశసేవ కోసం పుణెలోని ఎన్డీఏలో చేరారు. గత 21 సంవత్సరాలుగా అంచలంచెలుగా ఎదిగి ఫ్లైయింగ్ ఆఫీసర్ స్థాయికి చేరుకున్నారు. 2002లో స్పందనారెడ్డితో వివాహం జరిగింది. ఆమె కూడా భారత సైన్యంలో దంత వైద్యురాలుగా సేవలు అందిస్తున్నారు.
బంధుమిత్రులు, సన్నిహితులు, ప్రజలు స్వగృహం వద్దకు ఉదయమే చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు హాజరయ్యారు. కల్నల్ మృత దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళుర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: