ఇష్టదేవుడి దర్శనం కోసం వచ్చే యాత్రికుల పుణ్యస్నానాలకై యాదాద్రి(Yadadri Temple)లో కొండకింద గండిచెరువు చెంత "లక్ష్మీ పుష్కరిణి" నిర్మాణం పనులను మరింత వేగవంతం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా క్షేత్ర సందర్శనకు రావొచ్చని సీఎంవో భూపాల్ రెడ్డి గత ఆదివారం క్షేత్రాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన దశలో చెప్పారు. అప్రమత్తమైన యాడా యంత్రాంగం.. కట్టడాల నిర్మాణంలో వేగం పెంచింది.

రూ.11.55 కోట్ల వ్యయంతో 2.20 ఎకరాలలో ఒకేసారి 2500 మంది భక్తులు పుణ్యస్నానాలు చేసేలా లక్ష్మీ పుష్కరిణి ఏర్పాటవుతోంది. స్వాగత తోరణాలు, ప్రహారీపై ఐరావతం రూపాలు తీర్చి దిద్దుతున్నారు. హైందవ సంస్కృతి ప్రతిబింబించేలా రైలింగ్, ఫ్లోరింగ్ పనులు కొనసాగిస్తున్నారు. పుష్కరిణిలో స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కాంతులు విరజిమ్మేలా విద్యుత్ దీపాల ఏర్పాట్లకు వైరింగ్, నీటి వసతికై పైపులను బిగిస్తున్నారు. షవర్ బాత్ రూములు, దుస్తుల మార్పిడికై గదుల నిర్మాణం పూర్తి కావొస్తోందని యాడా అధికారులు తెలిపారు.
