మౌళిక సదుపాయాల కల్పన నిమిత్తం గతంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి యాదగిరిగుట్ట మేజర్ గ్రామ పంచాయితీకి ఇచ్చిన మాదిరిగానే.. ప్రస్తుత మున్సిపల్‌కు కూడా 30 శాతం రికరింగ్ డిపాజిట్ అమౌంట్‌ను చెల్లించాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను గురువారం మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
గతంలో మాదిరిగానే యాదాద్రి మున్సిపల్‌కు 30 శాతం రికరింగ్ డిపాజిట్ (పెండింగ్ గ్రాంట్) ను చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను వేరు, వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సుమారు అరగంట పాటు మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. 30 శాతం రికరింగ్ డిపాజిట్ అమౌంట్‌ను ఇచ్చే విధంగా తక్షణమే ప్రత్యేక జీవోను విడుదల చేయాలని కమిషనర్ అనిల్ కుమార్ ను మంత్రి ఆదేశించారు.
మున్సిపల్ భవనం అద్భుతంగా ఉండాలి
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మహాద్భుత క్షేత్రంగా రూపుదాల్చుతున్న తరుణంలో.. ఆ నిర్మాణాలకు అనుగుణంగా.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కొండ దిగువన యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్చర్‌ను సంప్రదించి అద్భుతమైన డిజైన్ తయారు చేయించాలని సూచించారు. ఈ నిర్మాణ విషయంలో నిధులు తక్షణమే మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత లక్షలాది భక్తులు యాదాద్రికి తరలివచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థం వందలాది మరుగుదొడ్లను నిర్మించాలని ఆదేశించారు.
ఆలేరు నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కితాబిచ్చారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మీ అదృష్టం.. ఆమె సేవలను వినియోగించుకోండి అంటూ కేటిఆర్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: 'అమూల్ బేబీ' ఎలా పుట్టిందో తెలుసా?