komatireddy venkatreddy comments on paper leakage case: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలని ఈ వ్యవహారంలో జరిగిన విషయాన్ని ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 500పోస్టులను నింపలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సాయం ఏ మాత్రం చాలదని వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.
దర్యాప్తు జరగాలి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని రహదారి బంగళాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేపర్ లీకేజీ అంశంపై మాట్లాడారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలని.. ఈ వ్యవహారంలో జరిగిన విషయాన్ని కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి బయటపెట్టాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర హోమ్ మినిస్టర్ని కలుస్తామన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులతో ఈ సమస్య ముడిపడి ఉందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీకి బాధ్యత వహిస్తూ వెంటనే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయాలన్నారు. పిల్లలు చాలా కష్టపడి కోచింగ్ తీసుకుని చదువుతున్నారని తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని గుర్తు చేశారు.
రూ.10వేలు సరిపోవు: వడగళ్ల వానతో రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తా అంటే, ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. రైతులను మేము కలిశామని సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. మేము ధర్నాలు చేసిన తర్వాతనే ప్రభుత్వం మరుసటి రోజు రైతులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చెయ్యలేదని, కొన్ని చోట్ల 50వేలు మాత్రమే రైతులకు రుణమాఫీ అయ్యింది. మరికొన్ని చోట్ల 25 వేలు మాత్రమే మాఫీ చేశారన్నారు.
ఖాళీలు కాగానే నోటిఫికేషన్: రాష్ట్రంలో ఇన్నేళ్లు అయినా టీచర్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 10 వేలు ఖాళీలు కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు భువనగిరిలో 4 వేల దరఖాస్తులు వేస్తే, 2300 దరఖాస్తులు అనర్హులుగా తేల్చారు. దానిలో అర్హులు లేరా? అని ప్రశ్నించారు. అదనంగా పేదలకు 2000 ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
"సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నదే మా డిమాండ్. ఈ విషయం నిమిత్తమే రేపు కేంద్ర హోం మినిస్టర్‌ను కలవబోతున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డిగారు మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. పాస్వర్డ్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి జరిగింది జరిగినట్లుగా చెబితే నిర్దోషిగా బయటపడతారు. రాష్ట్రంలో 500పోస్టులను నింపలేని పరిస్థితి నెలకొంది. వడగండ్ల వానకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఎకరానికి రూ.10వేలు ఇస్తా అన్నది. పెరిగిన ఎరువుల ధరలకు పదివేలు ఏ మూలకు సరిపోవు."-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ
ఇవీ చదవండి: