Karthika Masam Last Monday : కార్తికమాసం ఆఖరి సోమవారం కావడంతో నేడు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక సోమవారం భక్తులు పుణ్యదినంగా భావిస్తారు. ఈ ఏడాదిలో ఇదే ఆఖరి కార్తిక సోమవారం కావడంతో అనేక మంది భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. ఉదయాన్నే నదుల్లో స్నానమాచరించి భక్తులు స్వామి వారిని దర్శించుకొని తరిస్తున్నారు. శివుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండంతో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే చేరుకుని కోనేరులో పుణ్యస్నానమాచరించి రాజన్న స్వామి సన్నిధిలో కార్తికదీపాలు వెలిగించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం కావడం అది కూడా కార్తికమాస చివరి సోమవారం కావడంతో భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా రద్దీగా మారింది.
ఈశ్వరా పరమేశ్వరా - తెలంగాణలో కార్తిక వైభవం - దీపారాధనతో విరాజిల్లుతున్న శైవాలయాలు
యాదాద్రిలో కార్తిక మాస చివరి సోమవారం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి(Sri Lakshmi Narasimha Swamy Temple) ఆలయ సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కార్తికమాస చివరి సోమవారం కావడంతో యాదాద్రి అనుబంధ శివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేసి కార్తిక దీపాలను వెలిగించారు. యాదాద్రి కొండపై హరిహరుల క్షేత్రాలను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భక్తులు అనుబంధ శివాలయంలో అభిషేక, అర్చన రుద్రహోమ, పూజలో విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వేకువజాము నుంచే భక్తుల రద్దీ పెరగడంతో లఘురీతిన దైవదర్శనం కల్పిస్తున్నారు. పాతగుట్టలోనూ భక్తుల సందడి నెలకొంది. యాదాద్రి ఆలయానికి ఆదివారం నాడు ఒక రోజే వివిధ విభాగాల నుంచి ఆదివారం నిత్య ఆదాయం రూ.1,09,40,868 చేకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
కార్తీకం: నారసింహుని సన్నిధిలో భక్తుల కిటకిట
Karthika masam Last Monday In Bhadrachalam : భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం నదిలో కార్తికదీపాలు వదిలారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు చేసి గోదావరి నది ఒడ్డున గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తికదీపాలు వెలిగిస్తూ వారి మొక్కులను తీర్చుకుంటున్నారు.
అనంతరం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని అనుబంధ శివాలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గోదావరి నది పరివాహక ప్రాంతం సందడిగా మారింది. ఖమ్మం జిల్లా మధిరలోని వైరా నది ఒడ్డున ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో కార్తిక సోమవారం సందర్భంగా అయ్యప్పస్వాములు పెద్ద ఎత్తున మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు.
Karthika Masam Last Monday In Hanamkonda : హనుమకొండ జిల్లా వేయి స్తంభాల ఆలయం కార్తిక శోభతో కళకళలాడుతోంది. కార్తికమాస చివరి సోమవారం కావడంతో మహిళలు ఉదయమే ఆలయానికి చేరుకొని పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 360 వత్తులను దీపంగా మలిచి కాలుస్తూ, స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన ఉసిరికాయల దీపాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడితో వేయి స్తంభాల ఆలయం శివ నామస్మరణతో మారుమోగుతోంది. నెల రోజులపాటు ఉపవాస దీక్షలు చేసి చల్లంగా చూడు స్వామి అంటూ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఆధ్యాత్మికశోభ సంతరించుకున్న కూకట్పల్లి శివాలయం
IRCTC కార్తీక మాసం స్పెషల్ టూర్ - 7 జ్యోతిర్లింగాల దర్శనం - స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా!