ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన సాగుతోందన్నారు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ కుటుంబం... సంపదను సర్వం దోచుకుని తింటోందని ఆరోపించారు. ఈరోజు ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తరుణ్ చుగ్... స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరుణ్ చుగ్‌కు ఆలయాధికారులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, శక్తిమంతంగా తయారై... సర్వ సంపన్నమైన దేశంగా పురోభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. కేంద్రం వరద సాయం చేయలేదని ఆరోపిస్తున్న కేసీఆర్... అసలు వరద సాయానికి సంబంధించిన వివరాలు కేంద్రానికి పంపలేదన్నారు.

కుమారుడిని సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. గ్రేటర్లో నాలుగు స్థానాలున్న భాజపా బలం 48 స్థానాలకు చేరుకోవడమనేది ప్రజల ఆదరణకు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధి కేవలం భాజపాతోనే సాధ్యమన్నారు. తరుణ్ చుగ్ వెంట భాజపా నేతలు ప్రేమేందర్, మోత్కుపల్లి నర్సింహులు, బండ్రు శోభారాణి, పీవీ శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు.
ఇవీచూడండి: జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ షురూ