యాదాద్రి జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న మాల్యావి కరుణోదయ సొసైటీ నిర్వహకులను పోలీసులు అరెస్టు చేశారు. మొదట రూ.30వేలు చెల్లిస్తే ఇల్లు నిర్మించి ఇస్తామని నిందితులు పేదవారిని నమ్మించారు. ఇలా 2వేల 700మంది బాధితుల నుంచి దాదాపు రూ.8.1 కోట్లు వసూలు చేసినట్లు యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. డబ్బు కట్టాక కూడా ఇల్లు నిర్మించకపోవటం వల్ల ఆలేరుకు చెందిన రమాదేవి అనే మహిళ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కొండ కృష్ణమ్మ, కొండ రమేష్, కొండ వెంకట నారాయణ, కట్ట మహేంద్రనాధ్లను అరెస్టు చేయగా... కొత్త రాజిరెడ్డి, జజర్ల సాయి చరణ్‌లు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.12లక్షల 22వేల నగదు, ల్యాప్‌టాప్, పలు రసీదులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టు ద్వారా తమ సొమ్ము పొందాలని సూచించారు.
ఇవీ చూడండి: గుజరాత్ సర్కారుకు ఎన్హెచ్ఆర్సీ నోటీసు