Harish rao laid Foundation for Choutuppal 100 Beds Hospital: నత్తలు సైతం సిగ్గుపడేలా భువనగిరి ఎయిమ్స్ విస్తరణ పనులు జరుగుతున్నాయని... తెలంగాణపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 200ఎకరాల భూమిని, వందకోట్ల భవనాన్ని ఇస్తే నాలుగేళ్ల తర్వాత ప్రధాని శంకుస్థాపన చేశారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 36కోట్ల రూపాయలతో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రి భవనానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.
Choutuppal 100 Beds Hospital Foundation : మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మర్రిగూడలో 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించామని... చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రప్రభుత్వం గతేడాది 8 వైద్య కళాశాలలు ప్రారంభించిందన్నారు.
'జాతీయ రహదారిపై ఈ వంద పడకల ఆస్పత్రితో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ఎన్నో విలువైన ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే చౌటుప్పల్‌లో ఈ ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. ఇప్పటికే మర్రిగూడలో 30పడకల ఆస్పత్రిని ప్రారంభించుకున్నాం. నాంపల్లి, మునుగోడు రెండు పీహెచ్‌సీలను.. చండూరు, నారాయణపూర్ పీహెచ్‌సీలుగా 24గంటలు అప్‌గ్రేడ్ చేస్తాం.'-హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
వైద్యరంగంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు పెద్దపీట : తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వైద్యరంగంలో పెద్దపీట వేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో ఎయిమ్స్ కేటాయిస్తే నాలుగేళ్ల తర్వాత ప్రధాని శంకుస్థాపన చేశారన్న హరీశ్.. ఒక్క మెడికల్ కాలేజీ ఎయిమ్స్ పెట్టినందుకే గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా.. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు పెట్టబోతున్నామన్నారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలు కలుపుకుంటే మొత్తం 26 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాబోతున్నాయని హరీశ్‌రావు చెప్పారు.
'కేంద్ర ప్రభుత్వం 2018లో ఎయిమ్స్ ప్రారంభిస్తే ఇప్పటికీ అతీగతిలేదు. 2018లో ఎయిమ్స్ కేటాయించి ఇటీవల భవనానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 200ఎకరాలు, వందకోట్ల రూపాయల భవనం ఇచ్చింది. భువనగిరి ఎయిమ్స్‌లో ఇప్పటికీ ఓపీ సేవలు తప్పితే ఐపీ సేవల్లేవ్. నాలుగేళ్ల తర్వాత వచ్చి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసివెళ్లారు. నత్తలు సిగ్గుపడేలా ఎయిమ్స్ విస్తరణ పనులు సాగుతున్నాయి. ఒక్క ఎయిమ్స్‌కే బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు.'-హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి: