12వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు... సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దక్షిణం గేటు బందోబస్తు బాధ్యతలు పర్యవేక్షిస్తున్న వెంకటేశ్వర్లు ఇవాళ ఉదయం ఇతర కానిస్టేబుళ్లకు డ్యూటీ వేసి.. అల్పాహారం చేశాడు. అనంతరం విశ్రాంతి గదిలోకి వెళ్లి తన తుపాకితో కణతపై కాల్చుకున్నాడు. వెంటనే సహాచరులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
పోలీసులు అధికారులు ఏం చెబుతున్నారంటే..
మద్యానికి బానిసై.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వర్లు మద్యం మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడని.. పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గతంలో పలు మార్లు ఉన్నతాధికారులు హెచ్చరించారని చెబుతున్నారు. సెలవులపై వెళ్లి వచ్చి మంగళవారమే విధులకు హజరయ్యాడని.. గజ్వేల్ ఏసీపీ నారాయణ వివరించారు. వెంకటేశ్వర్లుతో పాటు.. అతని భార్య శోభ వచ్చి.. ఇక నుంచి బాధ్యాతయుతంగా ఉంటాడని విజ్ఞప్తి చేసినందునే తిరిగి విధుల్లో చేర్చుకున్నట్లు తెలిపారు.
మృతుని కుటుంబీకులు ఏమంటున్నారు
సహచర కానిస్టేబుళ్ల ఇబ్బందితోనే తన భర్త మృతి చెందాడని వెంకటేశ్వర్లు భార్య శోభ ఆరోపిస్తోంది. తనకేమైనా ఐతే వారే కారణం అని.. ఆమె భర్త గతంలో చెప్పాడని అంటోంది. మృతుడి మరణవార్తతో అతని స్వగ్రామం ముత్తిరెడ్డి గూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతిడి కుటుంబాన్ని ఆదుకుంటాం
గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటేశ్వర్లు మృతదేహానికి ఏసీపీ నారాయణ, 12 బెటాలియన్ పర్యవేక్షకులు రమేష్ నివాళులు అర్పించారు. మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందిస్తామని బెటాలియన్ పర్యవేక్షకులు రమేష్ తెలిపారు.
పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన ప్రకారం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విధుల్లో చేరినప్పటి నుంచి అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వెంకటేశ్వర్లు ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు 2005 జూన్ లో విధుల్లోంచి తొలగించారు. తిరిగి 2006 డిసెంబర్లో విధుల్లో చేర్చుకున్నారు. అతనిపై ఇప్పటి వరకు 13సార్లు క్రణశిక్షణ చర్యలు తీసుకున్నారు. మూడు సార్లు ఇంక్రిమెంట్ వాయిదా వేశారు. మద్యానికి బానిసై అనేక పర్యాయాలు అనధికారికంగా విధులకు గైర్హాజర్ అయ్యాడు. డీఎడిక్షన్ సెంటర్లో సైతం చికిత్స తీసుకున్నాడు. ఇటువంటి వ్యక్తిని వీవీఐపీ బందోబస్తు విధుల్లో నియమించడం పట్ల విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ఇటువంటి వారిని అక్కడ ఎలా వేశారు..?
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు ప్రముఖులు విరివిగా వ్యవసాయ క్షేత్రానికి వస్తుంటారు. ఇటువంటి కీలక ప్రాంతాల్లో వెంకటేశ్వర్లు వంటి వ్యక్తికి భద్రతపరమైన బాధ్యతలు అప్పగించటం అనుమానాలకు తావిస్తోంది.
శుక్రవారం అంత్యక్రియలు
వెంకటేశ్వర్లు మృతదేహానికి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్షలు పూర్తి చేసి.. స్వస్థలానికి తరలించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: సీఎం ఫాంహౌస్‌లో తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య