భక్త జనుల మానసిక పునరుత్తేజానికి యాదాద్రి పంచ నారసింహ క్షేత్రం మహా దివ్య పుణ్యక్షేత్రంగానే గాకుండా హరితమయ ప్రాంగణంగానూ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఈ క్షేత్రాన్ని ప్రపంచ ఖ్యాతి చెందేలా అభివృద్ధి పరిచేందుకు యాడా(యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ) యత్నిస్తోంది. విశాల రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో గ్రీనరీ పోషణను అధికారులు చేపట్టారు. ఒకనాటి రాళ్ల గుట్టను సుందరమయమైన "ఆలయ నగరి"గా రూపొందించారు. రకరకాల పూల మొక్కల పెంపకంతో ఆ ప్రాంగణం యాత్రికులకు వాహ్యాళి కేంద్రంగా అలరిస్తోంది.
చుట్టూ పచ్చదనం
ఈ క్షేత్రానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటైన రహదారుల్లో ఇరువైపులా మానసిక ప్రశాంతత కలిగించేలా హరితమయంగా ఇప్పటికే యాడా అధికారులు తీర్చిదిద్దారు. యాదాద్రికి 6 కి.మీ. దూరంలోని రాయగిరి నుంచి రహదారులన్నీ హరితమయంగా దర్శనమిస్తూ స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రాకపోకల్లో ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. మృగ నరహరి కొలువై ఉన్న కొండ చుట్టూ ఆకుపచ్చదనంతో ప్రకృతి అందం ప్రస్ఫుటమయ్యేలా వివిధ మొక్కలు, పచ్చిక బయళ్లతో రూపొందించారు. కొండకు దక్షిణ దిశలో రాతి కనిపించకుండా పచ్చదనంతో నిండిపోయింది. యాదాద్రికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా యాడా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రజారోగ్య పరిరక్షణకే హరిత హారం
లోక సంరక్షకుడి క్షేత్ర పరిధిలో మానవాళి మనుగడ కోసం అనుగుణంగా ఆహ్లాదకర వాతావరణం కలిగించేందుకు హరితహారం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పష్టం చేశారు. భక్తులెందరికో ఇలవేల్పుగా మారిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా, వాతావరణం ప్రజారోగ్యానికి అనుకూలంగా ఉండేలా వివిధ మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం సూచనలతో స్థానికంగా "యాడా" చేపట్టడం హర్షణీయమని ప్రభుత్వ విప్ అన్నారు.
రాష్ట్రంలో నాలుగు విడతలుగా హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నా.. ఇంకా వనాలను పెంచాలనే ఉద్దేశంతో పట్టణ ప్రగతిలో భాగంగా మరో 3వేల మొక్కలు నాటాలని భావిస్తున్నాం. ఇప్పటికే యాదాద్రిలో 40 వేల మొక్కలు నాటారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. -గొంగిడి సునీత, ఆలేరు ఎమ్మెల్యే
యాడా ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాం. భక్తి పారవశ్యంతో పాటు భక్తులకు పచ్చదనాన్ని అందిస్తున్నాం. నక్షత్ర ఆకారంలో నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగాయి. -కిషన్ రావు, యాడా వైస్ ఛైర్మన్
ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ దారిలో బుధవారం హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సునీత మొక్కలను నాటారు. కలెక్టర్ పమేలా సత్పతి, యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీత, యాదగిరిగుట్ట మున్సిపల్ ఛైర్‌పర్సన్ సుధ, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్ గౌడ్, ఆలయ ఉద్యోగులతో కలిసి హరితహారం నిర్వహించారు.
యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా హరితహారం పేరుతో కొన్ని వేల మొక్కలు నాటాం. సీఎం కేసీఆర్ దృఢసంకల్పంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పచ్చదనాన్ని ఇంకా పెంపొందించి భక్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే దిశగా పాటుపడుతున్నాం. -గీత, ఆలయ ఈవో
ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులను భాగస్వాములను చేయాలని ఎమ్మెల్యే సూచించారు. క్షేత్ర పరిధిలో ఇప్పటికే 40 వేల మొక్కలు నాటామని, పట్టణ ప్రగతి ద్వారా చేపట్టిన ఈ హరిత హారంలో మూడు వేల మొక్కలు నాటే లక్ష్యంగా కృషి చేయాలని కిషన్ రావు అన్నారు. ఇందులో తమ భాగస్వామ్యం ఉంటుందని ఆలయ ఈఓ గీత వెల్లడించారు.
ఇదీ చదవండి: KISHAN REDDY : పర్యాటకరంగానికి పునర్వైభవం తెస్తా