అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్, భాజపా శ్రేణుల మధ్య... ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకుంది. పట్టభద్రులను డబ్బులతో ప్రలోభపెడుతున్నారంటూ... గులాబీ శ్రేణులతో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఫంక్షన్ హాలు వద్ద... ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అధికార పార్టీ నాయకులు ఓటర్లకు అల్పాహారం ఏర్పాటు చేసి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ... కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు ఆరోపించారు.
తోపులాట
కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి.. జిల్లా కలెక్టరుతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ స్పందించడం లేదంటూ సదరు జడ్పీటీసీ... పార్టీ కార్యకర్తలతో ఏకంగా ఫంక్షన్ హాలు వద్దకు వెళ్లారు. భాజపా శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవటంతో... తెరాస, విపక్షాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని అందర్నీ చెదరగొట్టారు. ఏసీపీ, తహసీల్దార్ ఫంక్షన్ హాలుకు వెళ్లి... తెరాస శ్రేణుల్ని బయటకు పంపి తాళం వేశారు.
తెరాస, భాజపా శ్రేణులు ఘర్షణ
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని ఓ ఫంక్షన్ హాలులోనూ తెరాస నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ... భాజపా, కాంగ్రెస్ శ్రేణులు అందులోకి దూసుకెళ్లాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో... తెరాస, భాజపా శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాలు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... మాటామాట పెరిగి తోపులాట చోటుచేసుకుంది.
ట్రాక్టర్ షోరూంలో డబ్బుల పంపిణీ
అటు నల్గొండ జిల్లా దేవరకొండలోని ట్రాక్టర్ షోరూంలో... తెరాస నాయకులు డబ్బులు పంచుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. మండల స్థాయి నాయకులు పట్టభద్రులను రప్పించి... డబ్బులు అందజేస్తున్న వైనం వెలుగు చూసింది. స్థానికులకు వెయ్యి, స్థానికేతరులకు15 వందల రూపాయల చొప్పున పంచినట్లు ఆరోపణలున్నాయి.
ఇదీ చదవండి: బ్యాలెట్ బాక్సులకు సీల్... డీఆర్సీకి తరలింపు