కొవిడ్ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్ క్రాస్ సంస్థలన్నీ ముమ్మరంగా కృషి చేయాలని రెడ్ క్రాస్.. రాష్ట్ర అధ్యక్షురాలు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. అందుకోసం కావల్సిన సహాయసహకారాలు బాధితులకు అందించాలని కోరారు. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి దూరదృశ్య మాధ్యమం ద్వారా అన్ని జిల్లాల్లోని రెడ్ క్రాస్ ఛైర్మన్లతో సమావేశం నిర్వహించారు. కరోనా సమయంలో రోగుల కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. మాస్కులు, శానిటైజర్ల పంపిణీ చేయాలని సూచించారు.
ఇప్పటివరకు తాము అందిస్తున్న సేవలను వివిధ జిల్లాల ఛైర్మన్లు గవర్నర్ దృష్టికి తీసుకురాగా.. నిర్వాహకులను తమిళిసై అభినందించారు. రాచకొండ పోలీసుల సహకారంతో ముమ్మరంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఛైర్మన్ డాక్టర్.జి లక్ష్మీ నరసింహారెడ్డి వెల్లడించారు. కొవిడ్ నుంచి ప్రజలను చైతన్యవంతం చేస్తూ మాస్కులు, సబ్బులు, శానిటైజర్లు పంపిణీ చేసినట్లు వివరించారు. యూత్వింగ్ ద్వారా బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అనంతరం మోత్కూరులోని ఓ క్లినిక్‌లో కరోనా బాధితులకు లక్ష్మీ నరసింహారెడ్డి పండ్లు పంపిణీ చేశారు. పాజిటివ్‌గా నిర్ధరణ అయి హోమ్ క్వారంటైన్లో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించేందుకు రెడ్ క్రాస్ యూత్ సభ్యులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు ఎస్ఎన్ చారి, అనిల్ చేపూరి, సరస్వతి, శ్రీనివాస్ రెడ్డి, మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే.. అవగాహన, అప్రమత్తపై దృష్టి