Sarvail Gurukulam School: మట్టిలోని మాణిక్యాలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ పూర్వ గురుకుల విద్యావ్యవస్థకు ప్రతిరూపంగా నిలుస్తున్న విద్యాలయం.. సర్వేల్ గురుకుల విద్యాలయం. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామంలో 1971లో ఈ విద్యాలయం ప్రారంభమైంది. 2021, నవంబర్ 23న 50వ వసంతంలోకి అడుగిడింది. ఇక్కడ విద్యనభ్యసించిన సుమారు 4 వేల మంది.. వివిధ రంగాల్లో దేశం నలుమూలలా సేవలందిస్తున్నారు. వారంతా కలిసి ఈ నెల 26న ‘సర్వేల్ గురుకుల స్వర్ణోత్సవాలు’ నిర్వహించనున్నారు.
నవోదయ పాఠశాలలకు నాంది...
సర్వేల్‌లో గురుకుల విద్యాలయం ఏర్పాటుకు ఆద్యులు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు, మద్ది నారాయణరెడ్డి. వెల్మకన్నె వాసి మద్ది నారాయణరెడ్డికి సర్వేల్‌కు చెందిన వెనుముల దశరథమ్మతో వివాహమవగా.. ఆమెకు పసుపు, కుంకుమల కింద 44 ఎకరాల భూమి, భవన సముదాయాన్ని కానుకగా ఇచ్చారు. ఆ ఆస్తులను నారాయణరెడ్డి గురుకుల విద్యాలయ స్థాపన కోసం దానం చేశారు. పీవీ ముఖ్యమంత్రి హోదాలో సర్వేల్‌కు వచ్చి గురుకుల పాఠశాలకు బీజం వేశారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని పీవీ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సంకల్పించి నవోదయ పాఠశాలల ఏర్పాటుకు నాంది పలికారు.
అఖిల భారత సర్వీసుల్లో...
విశ్రాంత ఐఏఎస్ అధికారి దినకర్‌బాబు, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏజీఎం బీయూవీఎన్ రాజు, ఐజీ నాగిరెడ్డి, గవర్నర్ తమిళిసై కార్యదర్శి సురేంద్రమోహన్ తదితరులు ఇక్కడి గురుకులంలోనే విద్యనభ్యసించారు. ఇక్కడే చదివిన గాదరి కిశోర్ తుంగతుర్తి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
హైదరాబాద్‌లో స్వర్ణోత్సవాలు...
సర్వేల్ గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలను ఈ నెల 26న హైదరాబాద్ శివారు నాగారంలో నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్థలదాత మద్ది నారాయణరెడ్డి కుటుంబసభ్యులను సన్మానించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: KTR on teenmar mallanna tweet: 'నడ్డాజీ.. ఇదేనా మీరు నేర్పిస్తోంది..? ఇదేనా మీ సంస్కారం..?'