యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన డయాలసిస్ సెంటర్ ప్రారంభానికి వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన సెగ తగిలింది. డయాలసిస్ సెంటర్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభ ముందు ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసన తెలిపారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపారు. 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. విధుల్లో నుంచి తొలగించినప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ కూడా భారమైందని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.