జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోంచి తొలగించిన తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. భువనగిరి పట్టణం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్లు.. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నందుకు.. తమను విధుల్లోంచి తొలగించారని.. కరోనా పరిస్థితుల వల్ల తామే స్వచ్ఛందంగా సమ్మె విరమించామని.. తమ పట్ల దయతో విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధ రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారని, తామందరిని విధుల్లోంచి తొలగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో కష్టాల్లో పడ్డామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని గ్రామస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లుగా విధుల్లో ఉన్నవారిని తొలగించారని.. దసరా కానుకగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సంఘం నాయకురాలు వాణి కోరారు.
ఇదీ చదవండి: 17 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు