land acquisition for regional ring road in Yadadri: ప్రాంతీయ రింగు రోడ్డు కోసం తలపెట్టిన భూసేకరణ ప్రక్రియ ఓ ప్రహసనంగా తయారైంది. యాదాద్రి జిల్లా భువనగిరి ఆర్డీవో పరిధిలో, మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతాల్లో కొందరు రైతులు మూడో సారి కూడా భూమిని కోల్పోతున్నారు. దీంతో పలుచోట్ల అధికారులను అడ్డుకుని సర్వే చేసేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో పోలీసుల సహాయంతో సర్వే నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు అవతల నుంచి 158.645 కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే.
భువనగిరి ఆర్డీవో పరిధిలోని రాయగిరి, కేసారం, పెంచకల్‌పహాడ్, తుక్కాపూర్, గౌస్‌నగర్, యర్రంబల్లి గ్రామాల్లో రైతులు సర్వేను అడ్డుకుంటున్నారు. ఈ ఆర్డీవో పరిధిలోని సుమారు 493 ఎకరాలను రైతులు కోల్పోనున్నారు. ఒక్క రాయగిరి గ్రామంలోనే 266 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది.హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పలువురు రైతులు గతంలో భూమిని కోల్పోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతానికి నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న కాల్వ కోసం మరికొంత భూమి పోయింది. హైటెన్షన్ విద్యుత్తు సరఫరా కోసం విద్యుత్ టవర్లు పొలాల్లోంచి నిర్మించారు. ఒక్కో టవర్‌కు 17 నుంచి 30 కుంటల భూమి పోయింది. టవర్ కింది భాగంలో వ్యవసాయం చేయలేని పరిస్థితి. తాజాగా ప్రాంతీయ రింగు రోడ్డు కోసం కూడా ఆయా గ్రామాల పరిధిలో భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. పరిహారం ఎంత ఇవ్వాలనేది ఎక్కడికక్కడ నిర్ణయిస్తారు.
ఆ మూడు గ్రామాలను ఎందుకు తొలగించారో?: ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసిన ప్రాంతీయ రింగు రోడ్డు షెడ్యూల్‌లో భువనగిరి ఆర్డీవో పరిధిలో రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచకల్‌పహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్‌నగర్, యర్రంబల్లె, నందనం గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగు రోడ్డు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 24న జారీ చేసిన భూ సేకరణ చేయాల్సిన సర్వే నంబర్ల జాబితాలో భువనగిరి, చందుపట్ల, నందనం గ్రామాల ఊసే లేదు. ఈ మూడు గ్రామాలను తొలగించడం వెనుక పెద్దల భూములు ఉండటమే కారణమన్నది రైతుల ఆరోపణ. భువనగిరి పరిధిలోని పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్రముఖులకు చెందిన భూములు ఉండటంతోనే ఆయా గ్రామాలను తొలగించారని రైతులు చెబుతున్నారు.
రాయగిరిలో వివిధ అవసరాలకు భూ సేకరణ ఇలా...
- హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి కోసం 58 ఎకరాలు.
- రాయగిరి నుంచి యాదగిరిగుట్ట రహదారి విస్తరణ కోసం 13 ఎకరాలు.
- కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన కాల్వ కోసం 115 ఎకరాలు.
- తాజాగా ప్రాంతీయ రింగు రోడ్డు కోసం 266 ఎకరాలు సేకరించనున్నారు.
ఇలాగైతే బతికేదెలా?
ఇప్పటికి రెండు సార్లు భూమి పోయింది. రింగు రోడ్డు కోసం మూడోసారీ ప్రభుత్వం భూమిని తీసుకుంటామంటే బతికేది ఎట్టా? హైటెన్షన్ వైర్ల కోసం 38 గుంటలు పోయింది. కాళేశ్వరం కాల్వ కోసం 2.27 ఎకరాలు పోయింది. రింగు రోడ్డు కోసం మూడున్నర ఎకరాలు పోతోంది. రోడ్డు వేయటానికి ఇంక ఎటు నుంచి అవకాశం లేదన్నట్టు మా ఊరి మీద నుంచే తిప్పారు. మాకు ఉన్నదే తొమ్మిది ఎకరాలు. ఒకసారి వరి, మరోసారి కందులు వేస్తున్నాం. ఖర్చులన్నీ పోను రెండు పంటల మీద రూ.రెండు లక్షల వరకు మిగులుతున్నాయి.
మా అమ్మ సమాధినీ మిగల్చలేదు
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణలో ఇల్లు పోయింది. మా అమ్మ సమాధిని కూడా ప్రభుత్వం వదిలి పెట్టలేదు. రోడ్డు వెడల్పు చేసేందుకు ఇల్లు అడ్డం వస్తుందని తొలగించారు. మరోవైపు అడ్డం వస్తుందని మా అమ్మ సమాధిని, నీటి బావిని కూడా తొలగించారు. ఇప్పుడేమో రింగు రోడ్డు కోసం నాకు మిగిలిన నాలుగు ఎకరాలూ తీసుకుంటున్నారు. మార్కెట్ రేటు ఎకరా రూ.50 లక్షలున్నప్పుడు నష్టపరిహారంగా ఎకరాకు రూ.9 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఎకరం రూ. కోట్లు పలుకుతోంది. ఇప్పుడూ కంటి తుడుపుగానే ఇస్తారు.
పరిహారంతో కొన్న పొలమూ పోతోంది
కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వలో ఎనిమిది ఎకరాలు పోయింది. ఆ నష్టపరిహారం డబ్బుతో కొన్న మూడు ఎకరాల పొలం ఇప్పుడు ప్రాంతీయ రింగు రోడ్డులో పోతోంది. ఇక్కడ ఎకరా విలువ రూ. కోటి వరకు పలుకుతోంది. అధికారులు మాత్రం ఎకరానికి రూ.13 లక్షలు ఇస్తామంటున్నారు. ఎంత కాలం ఇలా నష్టపోవాలి?
ఇవీ చదవండి: