Farmer Touches JC Feet: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలం ముత్తిరెడ్డి గూడెం పరిధి సర్వే నెంబర్ 817లో బాధిత రైతు ఏకు చిన్న లక్ష్మారెడ్డికి 2 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం అందులో ఎకరం భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. మిగిలిన ఎకరం 10 గుంటల భూమిలో ఎలాంటి వివాదాలు లేవని బాధిత రైతు ఏకు చిన్న లక్ష్మారెడ్డి చెబుతున్నారు.
అయితే... వివాదం లేని ఎకరం 10 గుంటల భూమిలో ఎకరం భూమిని మోటకొండూర్ తహసీల్దార్.. తన సోదరుడు ఏకు చిన్న సంజీవ రెడ్డి పేరుపై పట్టాదారు పాసు పుస్తకం జారీచేశారని బాధిత రైతు ఆరోపించారు. ధరణి రికార్డుల్లో చూసుకోవడం వల్ల విషయం బయటపడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తన పేరున కేవలం 10 గుంటల భూమి మాత్రమే ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వివాదం లేని ఎకరం భూమిని తన పేరున నమోదు చేయాలని స్థానిక తహసీల్దార్‌ను వేడుకున్నా ఫలితం లేదని ఆయన వాపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని బాధిత రైతు ఏకు చిన్న లక్ష్మారెడ్డి కలిశారు. తన గోడును వెళ్లబోసుకుని కాళ్లు మొక్కారు. తన భూమి తనకు చెందేలా చూడాలని ప్రాధేయపడ్డారు. న్యాయం చేస్తానని బాధిత రైతుకు జాయింట్ కలెక్టర్ హామీనిచ్చారు.
ఇవీ చూడండి: