No family planning operation in Yadadri Govt Hospital: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు- ఆశాకార్యకర్తలు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తుర్కపల్లి, రాజాపేట మండలాలకు చెందిన సుమారు 100కి పైగా మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చారు. వారిని సంబంధిత మండలాల ఆశా కార్యకర్తలు ఆపరేషన్ కోసం తీసుకువచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం ఆపరేషన్ చేయడం కోసం 12 మందికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. కాగా వైద్యులు ఈ రోజు కేవలం రాజాపేట మండలం వాళ్లకే ఆపరేషన్ నిర్వహిస్తామని.. తుర్కపల్లి మండలం మహిళలకు వచ్చే నెల 5న ఆపరేషన్లు నిర్వహిస్తామని చెప్పారు.
దీంతో ఆగ్రహించిన ఆశా కార్యకర్తలు, మహిళలు బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆహారం, పానీయాలు సేవించకుండా మహిళలు ఆపరేషన్ కోసమే వేచి చూస్తున్నారన్నారు. సాయంత్రం వరకు కూర్చోబెట్టుకొని ఆపరేషన్ చేయబోమని అంటే ఎలా అని వారు ప్రశ్నించారు. అసలే ఎండాకాలం చిన్నపిల్లలతో వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఆశా కార్యకర్తలు.. తమను టార్గెట్ పూర్తి చేయాలని ఒత్తిడి చేసి, తీరా మహిళలను, వారి కుటుంబసభ్యులను ఒప్పించి ఇక్కడికి తీసుకువస్తే.. ఆపరేషన్ చేయబోమని చెప్పడం తమను బాధించిందన్నారు. దీంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. ఆపరేషన్ కోసం వచ్చిన మహిళల కుటుంబసభ్యులు, ఆశా కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. డీఎంహెచ్ఓ సాంబశివరావును విలేకరులు సంప్రదించగా మహిళలకు ఆపరేషన్ ముందు నిర్ధరణ పరీక్షలు, వారికి మత్తు పడుతుందా? లేదా ? అని పరీక్షిస్తారని చెప్పారు. అంతే కానీ మత్తు మందు ఇచ్చి వైద్యులు వెళ్లిపోయారని అనటం కరెక్ట్ కాదన్నారు. ఆపరేషన్ చేసే వైద్యుడికి ఆరోగ్యం సహకరించకపోవటంతో వచ్చే నెల 5 న మళ్లీ క్యాంపు నిర్వహిస్తామని సాంబశివరావు వెల్లడించారు.
ఇదీ చదవండి: ధరలు పెంచి మళ్లీ వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు : రేవంత్ రెడ్డి