యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడీగా జరిగింది. జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, జడ్పీటీసీ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మండలస్థాయిలో సక్రమంగా కరోనా నిర్ధరణ పరీక్షలు జరగడం లేదని కొందరు సభ్యులు ఆరోపించారు.
జిల్లాలో మొత్తం 9 అంబులెన్సులు ఉన్నాయని, జనరల్ ఫండ్ నుంచి మరో మూడు అంబులెన్సులు కొనుగోలు చేయనున్నట్లు జడ్పి ఛైర్మన్ సందీప్ రెడ్డి వెల్లడించారు. సంస్థాన్ నారాయణ్ పూర్, గుండాల మండలాలకు అంబులెన్స్ లు కేటాయించాలని ఆయా జడ్పీటీసీ సభ్యులు కోరారు. జనాభా ప్రాతిపదికగా అంబులెన్సులు వాడుకోవాలని చైర్మన్ సందీప్ రెడ్డి సూచించారు. రైతువేదిక నిర్మాణానికి విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని, ఇవి లేకపోవటం వల్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని సభ్యులు సూచించారు. రైతు బీమా దరఖాస్తులు చేసుకోవటానికి గడువు పెంచాలని సభ్యులు కోరారు.
వ్యవసాయ శాఖ కు సంబంధించి చర్చ ప్రారంభం కాగానే.., రైతుల భూములను లాక్కుంటున్నారని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని యదగిరిగుట్ట జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ సభ దృష్టికి తీసుకువచ్చారు. అది రెవెన్యూ పరిధిలోకి వస్తుందని , సబ్జెక్ట్ అది కాదని ఛైర్మన్ సందీప్ రెడ్డి వారించినా.. వారికి న్యాయం చేయాలని సభలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతుల భూములు బడాబాబులు లాక్కోవడంపై సమావేశంలో తెరాస, కాంగ్రెస్ నాయకలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.