యాదాద్రి(Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్ర సందర్శనకు తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, అష్టోత్తరం, పూజ కైంకర్యాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొండ కింద వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట వరకు సమయం పడుతోంది. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. క్షేత్రంలో సుమారు గంటకు పైగా చిరుజల్లులు కురిసినా.. భక్తులు లెక్క చేయకుండా క్యూలైన్లలో వేచి స్వామివారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: గోల్కొండ తల్లికి తొలి బోనం.. భాగ్యనగరమంతా కోలాహలం