యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఇవాళ భక్తుల దైవ దర్శనాలు, ఆరాధనలతో సందడి నెలకొంది. ఆస్థాన పరంగా స్వయంభువులకు నిత్య ఆరాధనలు జరిగాయి. బాలాలయంలో ఆర్జిత పూజలు, కళ్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, అలంకార సేవోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేపట్టిన పూజారులు ప్రతిష్ట మూర్తులను హారతితో కొలిచారు. స్వామి, అమ్మవార్లను మహా మండపంలో అధిష్టింప చేసి, అష్టోత్తరం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఆదివారం గోదాదేవి అమ్మవారు చేపట్టిన వ్రత పర్వంలో శ్రీరంగనాథ స్వామిని 26వ పాశురంతో కొలిచారు. శ్రీస్వామి, అమ్మవారికి మహిళలు హారతి నివేదించారు. ఆదివారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శన సమయానికి గంట సమయం పట్టింది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతి నిరాకరించారు. స్వామి వారిని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీవిశ్వ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఇదీ చూడండి : పులుల సంచారంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు