Devotees Rush In Yadadri: యాదాద్రిలో స్వయంభువులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. రద్దీ కొనసాగుతుండటంతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. వారి సౌకర్యార్థం కొండపైకి ఉచిత బస్సుల రాకపోకలు ఏర్పాటు చేశారు.
ప్రధానాలయంలో రేపట్నుంచి నిత్య కల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించనున్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణం దృష్ట్యా మొదట ఈ పర్వాలను బాలాలయంలో కొనసాగించారు. ఆలయ ఉద్ఘాటన పూర్తయ్యాక పాతగుట్టలోని ఆలయంలో నిర్వహిస్తున్నారు. రేపు నరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి కావడంతో ..ప్రధాన ఆలయంలోనే చేపట్టాలని దేవస్థానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు, పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శివకేశవులకు నిలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఉద్ఘాటన పర్వానికి సిద్ధమవుతోంది. ఈ నెల 25న సోమవారం ఉదయం 10.25 గంటలకు స్ఫటిక లింగ ప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠ, మహాకుంభాబిషేకం జరపనున్నారు.
ఇవీ చదవండి: వైభవంగా రామోజీరావు మనవరాలి వివాహం.. తరలివచ్చిన అతిరథ మహారథులు